శబరిమలలో పోటెత్తిన అయ్యప్ప భక్తులు
తిరువనంతపురం: మండల-మకరవిళక్కు సీజన్ నేపథ్యంలో కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. శనివారం సన్నిధానం, పంబ పరిసర ప్రాంతాలు భక్తుల శరణుఘోషతో మార్మోగుతున్నాయి. క్యూలైన్లలో రద్దీ అధికంగా ఉండటంతో స్వామివారి దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు వీలుగా రోజువారీ కోటాకు అదనంగా మరో 5 వేల క్యూ స్లాట్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే, శబరిమల దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ఆన్‌లైన్ వర్చువల్ క్యూ బుకింగ్ తప్పనిసరి అని, ముందస్తు బుకింగ్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని బోర్డు అధికారులు స్పష్టం చేశారు.