ఐటీ మంత్రి ఓఎస్డీ పేరుతో రూ.50.87 లక్షల టోకరా
హైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘరానా మోసగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితుడు కొలుగూరి రవికిరణ్‌పై ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నిందితుడు కొలుగూరి రవికిరణ్ తాను ఐటీ మంత్రి వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నట్లు నకిలీ ఐడీ కార్డును సృష్టించి నిరుద్యోగులకు ఎర వేశాడు. అంతేకాకుండా, అసలైన ప్రభుత్వ వెబ్సైట్లను పోలిన నకిలీ పోర్టల్స్‌ను రూపొందించి, వాటి ద్వారా అభ్యర్థులను పూర్తిగా నమ్మించాడు. టీచర్, అటెండర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రికార్డ్ అసిస్టెంట్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి నలుగురు బాధితుల నుంచి మొత్తం రూ.50.87 లక్షలు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ వెబ్సైట్లు, ఐడీ కార్డుల ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.