తెలుగు సినిమాల పైరసీపై సైబర్ క్రైమ్ కేసు
హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమను పైరసీ భూతం మరోసారి కలవరపెట్టింది. ఇటీవల విడుదలైన నాలుగు కొత్త తెలుగు సినిమాలు ఆన్‌లైన్‌లో లీక్ కావడంపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ‘రణబాలి’, ‘కల్ట్’, ‘ఆదర్శ కుటుంబం (హౌస్ నంబర్ 47)’, ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాల పైరసీ ప్రింట్లు ఒకే వెబ్‌సైట్‌లో దర్శనమివ్వడంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లోని యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రాజెక్ట్ హెడ్ మణీంద్ర బాబు యర్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు, క్యూబ్ సినిమా టెక్నాలజీస్ ఫోరెన్సిక్ విశ్లేషణ ఆధారంగా కీలక విషయాలను గుర్తించారు. పైరసీ బారిన పడిన వాటిలో ‘రణబాలి’, ‘కల్ట్’, ‘ఆదర్శ కుటుంబం’ అనే మూడు సినిమాలను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సిటీ స్క్వేర్ మాల్ థియేటర్‌లో దుండగులు రహస్యంగా క్యామ్‌కార్డర్‌తో చిత్రీకరించినట్లు తేలింది. అలాగే, నవంబర్ 20న విడుదలైన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని సైతం విడుదలైన రోజే అక్రమంగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. కర్నూలు థియేటర్‌లోని సీసీటీవీ ఫుటేజీ, టికెట్ బుకింగ్ వివరాలను సేకరించి నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతున్నారు.