నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: గురునానక్ దేవ్ జీ 557వ జయంతి వేడుకల సందర్భంగా నగరంలో ఇవాళ (శనివారం) సాయంత్రం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించనున్న భారీ మతపరమైన ఊరేగింపు నేపథ్యంలో వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ ఊరేగింపు సాయంత్రం 4 గంటలకు అశోక్ బజార్‌లోని గురుద్వారా నుంచి ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు కొనసాగనుంది.
అశోక్ బజార్ గురుద్వారా వద్ద మొదలయ్యే ఈ ఊరేగింపు అఫ్జల్‌గంజ్, ఎస్.ఏ. బజార్, ఎంజే మార్కెట్, పుత్లీబౌలి చౌరస్తా మీదుగా శంకర్ షేర్ హోటల్ వరకు చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరిగి అదే మార్గంలో ప్రయాణించి రాత్రి 10 గంటల సమయానికి తిరిగి అశోక్ బజార్ గురుద్వారాకు చేరుకోవడంతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.