ఆదినారాయణరెడ్డి అలకపై బీజేపీ అధిష్ఠానం బుజ్జగింపులు
విజయవాడ: కడప జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్ పదవి కేటాయింపు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో రాజకీయ ఉత్కంఠకు దారితీసింది. జెడ్పీ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డిని బుజ్జగించేందుకు బీజేపీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్నారు.
విజయవాడకు చేరుకున్న శివప్రకాష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితర నేతలు ఆదినారాయణరెడ్డితో భేటీ అయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఈ చర్చలు సుదీర్ఘంగా కొనసాగాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం కోసం తాము ఎంతో కష్టపడ్డామని, తమ కుటుంబానికి చెందిన రాజేష్ రెడ్డికి జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు టీడీపీకి ఇవ్వడం పట్ల ఆదినారాయణరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అయితే, కూటమి ధర్మం, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని బీజేపీ నేతలు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ పెద్దల చర్చల నేపథ్యంలో తన రాజీనామా నిర్ణయాన్ని శనివారం ఉదయం వరకు వాయిదా వేసుకున్నట్లు ఆదినారాయణరెడ్డి పేర్కొనడంతో, ఆయన తదుపరి కార్యాచరణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.