కుంభాభిషేకాలతో పులకించిన పోమాల
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని పోమాల గ్రామంలో శివశ్రీ వీరన్న స్వామి ఆలయ మహా ప్రతిష్ఠ మహోత్సవాలు రెండో రోజు అత్యంత భక్తిశ్రద్ధలతో,వైభవంగా కొనసాగాయి.వేదమంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఉదయం మండపారాధన,ఆవాహిత మండపారాధన,ఆవాహిత దేవతా హోమం నిర్వహించడం జరిగింది.స్వామివారి విగ్రహ మూర్తులకు ధాన్యాధివాసం నిర్వహించారు.మండపారాధ రుద్ర హోమం,మృత్యుంజయ హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.అనంతరం స్వామివారి విగ్రహ మూర్తులకు మహా స్నపన కుంభాభిషేకం,పుష్పాధివాసం, ఫలాధివాసం,శయ్యాధివాసం వంటి విశేష క్రతువులను భక్తిపూర్వకంగా జరిపించారు.చివరగా మహా మంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.శివశ్రీ వీరన్న స్వామి,ప్రభులింగం స్వామి,అభిలాష్ స్వామి,మహేష్ స్వామి,శివచరణ్ స్వామి,సదాశివ స్వాముల వైదికత్వంలో ఈ పూజా కార్యక్రమాలు ఆగమ శాస్త్రోక్తంగా ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కవిత నరేష్,ఉప సర్పంచ్ ఆంజనేయులు,ఆలయ కమిటీ సభ్యులు సుదర్శన్ చారి,మదన్మోహన్ గౌడ్,పెద్ద బుచ్చయ్య,నాగేష్ చారి,జగన్మోహన్ గౌడ్,రామచంద్రయ్య, ప్రజాప్రతినిధులు,గ్రామ పెద్దలు,మహిళలు,యువకులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.