‘రెట్రోవర్స్–2026’ పేరుతో 80వ దశకపు బాల్యపు మధుర జ్ఞాపకాల సందడి
సూర్య కరీంనగర్: భగత్‌నగర్‌లోని అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘అద్విత రెట్రోవర్స్–2026’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 1980వ దశకపు బాల్యపు మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తూ పాఠశాల ప్రాంగణాన్ని ఆనాటి పాతకాలపు వాతావరణం, రంగురంగుల అలంకరణలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
‘నో స్క్రీన్స్ – నో స్ట్రెస్ – జస్ట్ చైల్డ్‌హుడ్’ అనే సందేశంతో నిర్వహించిన ఈ వేడుకలో సంప్రదాయ ఆటలు, పాతకాలపు ఛాయాచిత్రాలు, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు, నృత్యాలు, నాటకాలు, పుస్తకాలు, గాజులు, పూలు, కుమ్మరి కళలు, సంప్రదాయ ఆహారపు స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ చిన్ననాటి అనుభవాలను పిల్లలతో పంచుకుంటూ ఆనాటి ఆటలు, సంప్రదాయాలను పరిచయం చేశారు. కుటుంబ సభ్యులందరూ కలిసి మధుర జ్ఞాపకాలను సృష్టించుకునే వేదికగా రెట్రోవర్స్ నిలిచింది.పాఠశాల డైరెక్టర్ అనుదీప్ సౌగాని దార్శనికత, ప్రోత్సాహం, సహకారంతో వేడుక విజయవంతమైంది. కార్యక్రమ నిర్వహణలో కృషిచేసిన వైస్ ప్రిన్సిపల్, నిర్వాహక బృందం, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులను పాఠశాల ప్రిన్సిపాల్ అభినందించారు. రెట్రోవర్స్ కేవలం కార్నివాల్ మాత్రమే కాదని, ప్రతి ఒక్కరినీ బాల్యంలోకి తీసుకెళ్లిన మధుర జ్ఞాపకాల ప్రయాణమని ఆమె పేర్కొన్నారు.