బోరు మోటార్ల వైర్లే టార్గెట్.. రాత్రికి రాత్రే 40 వైర్లు చోరీ
వికారాబాద్ ,మేజర్ న్యూస్: కొటాలగూడెం, సిద్ధలూరు గ్రామాల పరిధిలోని వ్యవసాయ పొలాల్లో గుర్తుతెలియని దుండగులు చోరీలకు పాల్పడ్డారు. రాత్రి వేళల్లో పంట పొలాల్లోకి చొరబడి బోరు మోటార్లకు సంబంధించిన విద్యుత్ వైర్లను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. సుమారు 60 బోరు మోటార్ల వైర్లు చోరీకి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే పంటలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు దొంగల బెడద కొత్త సమస్యగా మారింది.
ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు.. మరోవైపు దొంగల బెడద
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక భూగర్భ జలాలు తగ్గిపోవడంతో రైతులు సాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, నీటి కొరతతో బోరు మోటార్లు కాలిపోతుండగా, పంట పొలాలు బీడుగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బోరు మోటార్ల విద్యుత్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లడంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు.కష్టపడి సాగు చేసుకునే రైతులకు వరుస సమస్యలు ఎదురవుతుండటంతో బాధిత గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పొలాల్లో రాత్రి వేళల్లో నిఘా పెంచాలని, చోరీలకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.