టైర్ బ్లాస్ట్‌తో ఆటోను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండలం నాందార్‌పూర్ గ్రామ సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో అదుపుతప్పిన కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.కారు నడుపుతున్న లగచర్ల గ్రామానికి చెందిన శ్రీశైలం ప్రమాదంలో మృతి చెందారు. మరో వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాకు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.సమాచారం అందుకున్న స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో లగచర్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.