ప్రముఖ సంగీత దర్శకుడు పి. విజయ శేఖర్ కన్నుమూత.. నెల్లూరులో విషాదం
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తెలుగు సినీ, సంగీత రంగాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ సంగీత దర్శకుడు పి. విజయ శేఖర్ (72) నెల్లూరులో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయ శేఖర్ మరణవార్తతో ఆయన అభిమానులు, సన్నిహితులు, సంగీత రంగ ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన భారత్ బంద్ చిత్రానికి విజయ శేఖర్ సంగీతం అందించారు. ఆ సినిమా ద్వారా సినీ సంగీత దర్శకుడిగా ఆయనకు విశేష గుర్తింపు లభించింది. సినిమా రంగంతో పాటు నాటక రంగంలోనూ ఆయనకు బలమైన అనుబంధం ఉంది. పలు నాటకాలకు స్వరాలు సమకూర్చడంతో పాటు భక్తి గీతాల ద్వారా కూడా శ్రోతలను ఆకట్టుకున్నారు.
2010లో విడుదలైన ఆకారం చిత్రానికి విజయ శేఖర్ చివరిసారిగా సంగీతం అందించారు. సంగీతంపై అమితమైన మక్కువతో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ఆయన మృతి తెలుగు సంగీత రంగానికి తీరని లోటని సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.
Also Read: ఓటీటీలోకి 'కోర్ట్' శ్రీదేవి రొమాంటిక్ చిత్రం హైకూ.. డిజిటల్ స్ట్రీమింగ్పై తాజా అప్డేట్