తోటలో మిర్చి దొంగతనం.. రైతుకు బారి నష్టం.
కళ్యాణదుర్గం: రైతులు కష్టపడి పండించిన పంటలకు రక్షణ లేకుండా పోతోంది. పంట చేతికొచ్చే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో మిర్చి పంట చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బయన్న అనే రైతు తన తోటలో సాగు చేసిన మిర్చిని గుర్తుతెలియని వ్యక్తులు కోసి అపహరించినట్లు తెలిపారు. సుమారు నాలుగైదు క్వింటాళ్ల మిర్చి చోరీకి గురై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎంతో శ్రమించి పంటను సాగు చేసి, చేతికొచ్చే సమయంలో చోరీ జరగడంతో బాధిత రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టానికి తగిన ఫలితం వస్తుందని ఆశించిన తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై బాధిత రైతు కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన తోటలో జరిగిన చోరీపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ గంగాధర్ మాట్లాడుతూ రైతులు తమ పంటలు, తోటల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, చోరీ ఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. పంట చోరీలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. రైతులు తమ పంటలకు తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నెలల తరబడి శ్రమించి పండించిన పంటలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించడం వ్యవసాయ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గ్రామాలకు దూరంగా ఉన్న తోటలు, పొలాల వద్ద రాత్రి వేళల్లో భద్రత సమస్యగా మారుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు నిఘా పెంచి, చోరీకి పాల్పడిన వారిని గుర్తించి బాధిత రైతుకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.