కొత్తగూడెం రీజియన్లోని నాలుగు ఏరియాల ఓవర్ బర్డెన్ ఏజెన్సీలకు సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశం
తెలంగాణ బ్యూరో ప్రతినిధి : సింగరేణి మొత్తం మీద అత్యధిక బొగ్గును ఉత్పత్తి చేస్తున్న కొత్తగూడెం రీజియన్ (కొత్తగూడెం ఏరియా, సత్తుపల్లి ఏరియా, ఇల్లందు ఏరియా, మణుగూరు ఏరియా) లో లక్ష్యాలకు తగిన విధంగా ఓవర్ బర్డెన్ తొలగించాలని, దీనికి అనుగుణంగా ఏజెన్సీలవారు తగిన సంఖ్యలో యంత్రాలను, మానవ వనరులను సమకూర్చుకోవాలని సింగరేణి సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశించారు.
శనివారం ఉదయం హైదరాబాద్ సింగరేణి భవన్ లో ఆయన కొత్తగూడెం రీజియన్ లోని పలు ఓపెన్ కాస్ట్ గనుల బొగ్గు ఉత్పత్తి, అందుకు అనుగుణంగా సాగుతున్న ఓవర్ బర్డెన్ తొలగింపు, బొగ్గు రవాణా, తదితర అంశాలపై ఆయా ఏరియాల జీఎంలు, ఓబీ తొలగింపు ఏజెన్సీల ప్రతినిధులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో సింగరేణి సంస్థ ప్రతీ రోజు తెలంగాణ జెన్ కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 75 వేల టన్నుల బొగ్గును సరఫరా చేయాల్సి ఉంటుందని, అదే సమయంలో సింగరేణితో ఇంధన సరఫరా ఒప్పందం ఉన్న విద్యుత్ కేంద్రాల అవసరాలకు బొగ్గును రవాణా చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి సాధించాలంటే ఓవర్ బర్డెన్ తొలగింపు నిర్దేశిత లక్ష్యాల మేర జరగాలని స్పష్టం చేశారు.
ప్రతీ రోజు నిర్దేశించిన లక్ష్యం మేరకు ఓవర్ బర్డెన్ తొలగిస్తేనే దాని కింద ఉన్న బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశం ఉందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధన కోసం అన్ని ఏరియాలు కలిపి రోజుకు 14.15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ లక్ష్యాలను సాధించాలని, వీటిలో కొత్తగూడెం రీజియన్ కు సంబంధించిన నాలుగు ఏరియాలు రోజుకు 5.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను ప్రతీ రోజు తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓబీ లక్ష్యాల సాధనకు గల ఇబ్బందులు ఏమన్నా ఉంటే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఓవర్ బర్డెన్ తొలగింపులలో అలసత్వం చూపే ఏజెన్సీల పట్ల యాజమాన్యం ఉదాసీనంగా ఉండబోదని స్పష్టం చేశారు.
కొత్తగూడెం రీజియన్ లోని నాలుగు ఏరియాల గనులలో సాగుతున్న బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపు, బొగ్గు రవాణా, తదితర అంశాల పైన అధికారులు వివరించగా ప్రతీ అంశాన్ని ఛైర్మన్ కూలంకషంగా చర్చించి ఆదేశాలు జారీ చేశారు.
కొత్తగూడెం ఏరియా నుంచి రోజుకు 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 0.55 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు జరగాలని స్పష్టం చేశారు.
సత్తుపల్లి ఏరియాలో రోజుకు 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాలని, ఇందుకోసం రోజుకు 2.4 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలన్నారు.
మణుగూరు ఏరియాలో రోజుకు 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాలని, ఈ లక్ష్యాల సాధన కోసం రోజుకు 2.25 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను తొలగించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు.
ఇల్లందు ఏరియాలో రోజుకు 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని, 10 వేల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని స్పష్టం చేశారు. భద్రతతో కూడిన బొగ్గు ఉత్పత్తి, నాణ్యతతో కూడిన బొగ్గు రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
వచ్చే కొద్ది నెలల్లో కాంట్రాక్టు కాలపరిమితి ముగియనున్న గనులకు సంబంధించిన అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఆయా గనుల కోసం కొత్త కాంట్రాక్టు ప్రతిపాదనలను త్వరితగతిన రూపొందించి, అవసరమైన అనుమతులు పొందాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో ఛైర్మన్ తో పాటు సంస్థ డైరెక్టర్లు ఎల్.వి సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు, తిరుమల రావు, ఈడీ (కోల్ మూవ్ మెంట్) బి. వెంకన్న, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్) టి. శ్రీనివాస్, జీఎం (సీపీపీ) దేవేందర్, కొత్తగూడెం ఏరియా జీఎం వెంకట రమణ, మణుగూరు ఏరియా జీఎం దుర్గం రాంచందర్, సత్తుపల్లి ఏరియా జీఎం వెంకటాచారి, ఇల్లందు ఏరియా జీఎం వీసం కృష్ణయ్య, కార్పొరేట్ జనరల్ మేనేజర్లు మరియు సంబంధిత గనుల అధికారులు, ఓవర్ బర్డెన్ కాంట్రాక్టర్ లు పాల్గొన్నారు.