కరువు మండలాలను వెంటనే ప్రకటించాలి
కరువు మండలాలను వెంటనే ప్రకటించాలి
-నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలి
-నేడు కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి
-సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా
కొత్తగూడెం అర్క్, సూర్య(మేజర్ న్యూస్)- రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా తక్షణమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, అదేవిధంగా రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించి ప్రకటించాలని, పంట నష్టపరిహారంతో పాటు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా డిమాండ్ చేశారు.ఈ ప్రధాన డిమాండ్లపై మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే మహాధర్నాకు సంబంధించి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
వర్షాభావం, భూగర్భ జలాలు అడుగంటడంతో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, పొట్టకొచ్చిన పంటలు నీరందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలు లేకుండా వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని, ఎకరానికి వరికి రూ. 30 వేలు, పత్తి, మిర్చికి రూ. 50 వేల నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. కౌలు రైతులకూ పరిహారం ఇవ్వాలని, ఉపాధి హామీ పనులతో పాటు పశుగ్రాసాన్ని ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ఈ ధర్నాకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు.జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార సాధన కోసం తలపెట్టిన ఈ పోరాటంలో పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అన్నదాతలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.