న్యాయం అందరి హక్కు * లకోర్టు ఆవరణలో ఘనంగా జాతీయ న్యాయ సేవా దినోత్సవం *
పాతపట్నం, సూర్య : ఉచిత న్యాయ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సోమవారం జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోర్టు ఆవరణలో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయ నిపుణులు మాట్లాడుతూ సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా న్యాయ సేవా అధికార సంస్థ నిరంతరం పనిచేస్తోందని స్పష్టం చేశారు. న్యాయ సేవా సంఘం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా న్యాయ సలహాలు, సూచనలు అందించడంతో పాటు ఆర్థిక స్తోమత లేక న్యాయవాదిని నియమించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ప్రభుత్వ ఖర్చులతోనే న్యాయవాదిని సమకూర్చి బాధితుల పక్షాన నిలబడి వారికి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్‌లు, మీడియేషన్ పద్ధతులు ఎంతగానో ఉపయోగపడతాయని, సమయం మరియు డబ్బు ఆదా అవుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యు. బాలయ్య, ప్యానెల్ అడ్వకేట్ జి. రామ్మోహన్ రావు, ఎల్. యుగంధర్, రామకృష్ణ తదితరులతో పాటు ట్రైన్డ్ మీడియేటర్స్, ప్యానెల్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పలువురు కక్షిదారులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేశారు.