ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు
(రంగారెడ్డి - మేజర్ న్యూస్) : ప్రజావాణికి వచ్చే ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 26 ఫిర్యాదులను స్వీకరించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తుపై అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.
కాగా, ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 19, ఇతర శాఖలకు సంబంధించి 7 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ కె. కిరణ్మయి, చంద్రారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.