పేద విద్యార్థిని చదువుకు మండవ ఫౌండేషన్ ఆర్థిక చేయూత
దుర్గి మండలం ముటుకూరు గ్రామానికి చెందిన పేద విద్యార్థిని ఉన్నత చదువులకు మండవ ఫౌండేషన్ అధినేత మండవ రవి ఆర్థిక చేయూత అందించారు. గ్రామంలోని లూథరన్ చర్చిలో ముటుకూరు ఎంపీటీసీ మాచర్ల రత్తమ్మ ఇస్రాయేలు చేతుల మీదుగా బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని పేరువాలా సౌజన్యకు ట్యూషన్ ఫీజు, నర్సింగ్ పుస్తకాల ఖర్చుల నిమిత్తం రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ముటుకూరు గ్రామానికి చెందిన పేరువాలా అనూష ఇంటర్మీడియట్‌లో 900కు పైగా మార్కులు సాధించడంతో పాటు నీట్, ఎంసెట్ పరీక్షలు రాశారు. ఆమెకు కడప జిల్లా రిమ్స్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ సీటు లభించినప్పటికీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని మండవ ఫౌండేషన్ అధినేత మండవ రవి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి విద్యార్థిని మొదటి సంవత్సరం చదువుకు అవసరమైన ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు.ఈ సందర్భంగా మండవ రవి మాట్లాడుతూ విద్య పేదరికాన్ని అధిగమించడానికి గొప్ప ఆయుధమని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థిని బాగా చదువుకొని భవిష్యత్తులో పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు లింగ నాసరయ్య, లింగ గురవయ్య, ఆంధ్రప్రదేశ్ ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ వైద్య మిత్ర రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల బుజ్జి, స్థానిక పాస్టర్ ఏసుదాసు, మాచర్ల పురుషోత్తం, మాచర్ల రవీంద్ర, మాచర్ల యోహాను, మాచర్ల అన్నారావు, మాచర్ల నిఖిల్, వసంతం జానుబాబు తదితరులు, మండవ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
పేర్ల వెంకటేశ్వర్లు సీనియర్ రిపోర్టర్ దుర్గి