కనువిందుగా.. ‘కళా స్పందన ఆర్ట్ ఫెయిర్’
తెలంగాణ బ్యూరో , ప్రతినిధి : నగరంలో ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బంజారాహిల్స్‌లోని కళింగ కల్చరల్ సెంటర్ (సాంస్కృతిక కేంద్రం)లో శుక్రవారం ‘కళా స్పందన ఆర్ట్ ఫెయిర్’ ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగే ఈ ఉమ్మడి ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా ప్రముఖ సీనియర్ శిల్పి, పద్మశ్రీ పురస్కార గ్రహీత యాదగిరిరావు, సీనియర్ శిల్పి జి.యాదగిరి హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ యాదగిరిరావు మాట్లాడుతూ.. ప్రదర్శనలో ఉంచిన చిత్రాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. యువ కళాకారులు ఇతరుల శైలిని అనుకరించకుండా, తమ సొంత ఆలోచనలకు పదును పెట్టాలని హితవు పలికారు. ఎదుగుతున్న ఆర్టిస్టులైనప్పటికీ వారి సృజనాత్మకతలో ఎంతో పరిణతి కనిపిస్తోందని కొనియాడారు. భారతీయ సమకాలీన చిత్రకళ భవిష్యత్తులో మరింతగా రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో సీనియర్ శిల్పి జి.యాదగిరి మాట్లాడుతూ.. కళారంగంలో అధికారిక శిక్షణ, విజ్ఞానం ఎంతో అవసరమన్నారు. పది సాధారణ చిత్రాల కంటే.. ఎంతో సృజనాత్మకతతో, నాణ్యతతో రూపొందించిన ఒకే ఒక్క ఒరిజినల్ చిత్రానికి మార్కెట్లో అత్యధిక వాణిజ్య విలువ లభిస్తుందని ఆయన ఉదాహరణలతో వివరించారు.
ఆకట్టుకుంటున్న వెయ్యి కళాకృతులు..
ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా 100 మందికి పైగా కళాకారులు, ప్రముఖ ఆర్ట్ గ్యాలరీలు పాల్గొని సుమారు వెయ్యి కళాకృతులను ప్రదర్శిస్తున్నారు. సంప్రదాయ చిత్రకళ నుంచి ఆధునిక కళారూపాల వరకు.. ఆయిల్, వాటర్, యాక్రిలిక్ చిత్రాలు, రెసిన్ ఆర్ట్, కేరళ కుడ్యచిత్రాలు, మధుబని, తంజావూరు చిత్రకళ, శిల్పాలు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు అలంకరణ వస్తువులు, డిజైనర్ చీరలు, దుస్తులు కూడా ప్రదర్శనలో ఉంచారు.
నవంబరు 1 వరకు అవకాశం..
కళా స్పందన ఆర్ట్ ఫెయిర్ క్యురేటర్ సుదీప్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. అక్టోబరు 30 నుంచి నవంబరు 1 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. సందర్శకులకు ప్రవేశం ఉచితం. వాలెట్ పార్కింగ్ సదుపాయంతో పాటు ప్రత్యక్ష చిత్రలేఖన ప్రదర్శన (లైవ్ పెయింటింగ్) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు www.indianartfair.net.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.