telangana
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి.. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్ దీపక్ తివారి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లు) గుర్తించి తక్షణమే అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాతో కలిసి నిర్వహించిన రోడ్డు భద్రతా సమీక్ష సమావేశంలో కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, వాటికి గల కారణాలు, నివారణ చర్యలపై సమీక్షించారు. రహదారులపై గుంతలను వెంటనే మరమ్మతు చేయాలని, ప్రమాద సూచిక బోర్డులు, వీధి దీపాలు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ఉపయోగించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.అనంతరం మత్తు పదార్థాల నియంత్రణపై సమీక్షిస్తూ కలెక్టర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ వ్యవస్థ, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, విద్యాసంస్థల్లో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తుందని తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు అధికంగా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు స్థితిలో వాహనాలు నడపకూడదని సూచించారు. మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని, అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీస్ శాఖ రూపొందించిన అవగాహన వీడియోను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు.ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, ఆర్ అండ్ బీ ఈఈ శ్రీధర్ రెడ్డి, ఈఈ పీఆర్ ఉమేష్ కుమార్, డీపీఓ జయసుధ, వైద్య అధికారి చంద్రశేఖర్, డీఎస్పీలు, సీఐలు, డ్రగ్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు, పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.