ఘనంగా అయ్యాచార దీక్షల మహోత్సవం
జహీరాబాద్;పట్టణంలోని సిద్ధేశ్వరాలయంలో జంగమ సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అయ్యాచార దీక్షల మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా శుక్రవారం తొలిరోజు ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, దీక్షా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహోత్సవంలో భాగంగా ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం పంచాచార్యులు, అష్టదిక్పాలకులకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు నవగ్రహాది సర్వదేవతల హవనాలను వేదోక్తంగా చేపట్టారు. పూజా కార్యక్రమాల అనంతరం ధనసిరి హీరేమట్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 108 వీరేశ్వర శివాచార్య మహాస్వామి ఆధ్వర్యంలో అయ్యాచార దీక్షల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీక్షాపరులు భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహాస్వామివారు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. జంగమ సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహోత్సవాలు మరో రోజులపాటు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, అయ్యాచార దీక్షాపరులు, జంగమ సమాజం ప్రతినిధులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.