డైట్ లో ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం.
అనకాపల్లి, అక్టోబర్ 31, మేజర్ న్యూస్: స్థానిక దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (డైట్), అటానమస్ కళాశాలలో శనివారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. వైకుంఠరావు భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ డా. వైకుంఠరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ సమగ్రత, ఐక్యత, సమైక్యతను కాపాడటంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశానికి గొప్ప బలమని, కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతీయ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని విద్యార్థులతో రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐక్యతను బలోపేతం చేయడం, ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడం, దేశ సమగ్రతకు కట్టుబడి ఉండటం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.