పత్తి రైతులను ఆదుకోండి - క్వింటాకి రూ 12,000-00 లు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి - టి డీ పీ రాష్ట్ర నాయకులు కొలను వేణుగోపాల్ రెడ్డి
తెలంగాణ బ్యూరో , ప్రతినిధి : రైతు సంక్షేమం అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం , రైతు గోస పట్టించుకోకుండా రైతులను నట్టేట ముంచుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కొలను వేణుగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడు అవ్వారు సుబ్బారావు అధ్యక్షతన సమావేశం జరిగింది . ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కొలను వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు .విత్తనాలు ఎరువులు పురుగుమందుల ధరలు విపరీతంగా పెరిగాయి . ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురువక పత్తి పంట దిగుబడి గణనీయంగా పడిపోయింది . ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతు పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు కూడా కావడం లేదు కావున రాష్ట్ర ప్రభుత్వం పత్తికి క్వింటాలకు రూ12,000 లు మద్దతు ధర ప్రకటించి, తేమ శాతం పేరుతో రైతులను వేధించకుండా రాష్ట్రవ్యాప్తంగా సీసీఐ కేంద్రాల ద్వారా పత్తిని పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతే దేశానికి వెన్నెముక అని మరిచి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని , రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కావున వెంటనే రూ 12000-00 లు మద్దతు ధర ప్రకటించి రైతులని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో గుమ్మడి అంజిరెడ్డి, శ్రీపతి రామ్ రెడ్డి, గోపాల్ రెడ్డి,కాటేపల్లి వెంకటేశం, ముత్యాల బిక్షపతి, వావిళ్ళ సత్తయ్య, నర్రి నరసింహ, కడ్తాల స్వామి, దుబ్బాక స్వామి, భగవంతు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.