మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ భద్రత - 144 సెక్షన్ అమలు.
నర్సీపట్నం డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ తుహిన్ సిన్హా.
అనకాపల్లి, అక్టోబర్ 31, మేజర్ న్యూస్: జిల్లా పరిధిలోని జీవీఎంసీ 9 వార్డులు (అనకాపల్లి, పరవాడ, సబ్బవరం), అలాగే నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీలలో నేడు (01.11.2026) జరగనున్న ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. శనివారం నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ మైదానంలో ఎన్నికల విధులకు కేటాయించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి బ్రీఫింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణలో పోలీసులు పాటించాల్సిన మార్గదర్శకాలు, చేయవలసిన మరియు చేయకూడని పనులపై ఎస్పీ దిశానిర్దేశం చేశారు. అనంతరం నర్సీపట్నం, బొడ్డేపల్లిలోని డాన్ బాస్కో డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) కేంద్రం, కౌంటింగ్ కేంద్రాన్ని నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణతో కలిసి ఎస్పీ పరిశీలించారు. అక్కడ కల్పించాల్సిన మౌలిక వసతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ యాక్ట్ సెక్షన్ 30, బి.ఎన్.ఎస్.ఎస్. సెక్షన్ 163 (గతంలో 144 సెక్షన్) అమల్లో ఉంటాయని, ప్రజలు, రాజకీయ పార్టీల అభ్యర్థులు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ ఆదేశాలు, చేయవలసిన పనుల అనగా కేటాయించిన పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతలు పర్యవేక్షించాలి. పక్షపాత వైఖరి లేకుండా, చట్టం ముందు అందరూ సమానులే అనే దృక్పథంతో నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి. ఓటర్లు భయభ్రాంతులకు గురికాకుండా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా రక్షణ కల్పించాలి. పోలింగ్ బూత్‌ల వద్ద క్యూలైన్లను క్రమబద్ధీకరించాలి; వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. రిటర్నింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, పోలింగ్ బృందాలతో సమన్వయంతో నిబంధనలు అమలు చేయాలని తెలియజేశారు.
అలాగే చేయకూడని పనులు అనగా విధుల్లో వ్యక్తిగత పక్షపాతం ప్రదర్శించరాదు, ఓటర్లపై అధికారం చూపకూడదు. ఓటర్లు, గుర్తింపు కార్డులు కలిగిన పోలింగ్ ఏజెంట్లు మినహా అనధికార వ్యక్తులను, రాజకీయ నాయకులను పోలింగ్ కేంద్రాల్లోకి రానివ్వకూడదు. నియమిత అధికారులు మినహా ఎవరూ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి తీసుకెళ్లకుండా కఠినంగా వ్యవహరించాలి. చిన్న వివాదం తలెత్తినా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలి. విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదు. పోలింగ్ స్టేషన్ ద్వారాల వద్ద గుంపులుగా చేరడం, రాజకీయ చర్చలు నివారించాలి. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు, ఏ.ఆర్ డీఎస్పీ ఎ.రవికుమార్, పలువురు సీఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.