telangana
స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి చేస్తాం.. సర్పంచ్ మంగలి స్రవంతి శివరాజ్
బంట్వారం,మేజర్ న్యూస్: మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని బస్వాపూర్ గ్రామ సర్పంచ్ మంగలి స్రవంతి శివరాజ్ తెలిపారు. మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం రూ.10 లక్షల విబిజి రామ్‌జీ నిధులతో నిర్మించనున్న భవనానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాలు గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. సంఘాల సభ్యులు ఒకచోట సమావేశమై పొదుపు కార్యక్రమాలు, ఆర్థిక లావాదేవీలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రత్యేక భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడంతో పాటు మహిళలు స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తామని అన్నారు.గ్రామ అభివృద్ధికి దశలవారీగా ప్రణాళికలు రూపొందించి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామస్తులు శాకం రాములు, శాకం నర్సింలు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.