బషీరాబాద్, మేజర్ న్యూస్ : గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా మాటల్లో కాకుండా చేతల్లో అభివృద్ధిని చూపిస్తూ ముందుకు సాగుతున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) అన్నారు. ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం బషీరాబాద్ మండలంలోని నవల్గ గ్రామంలో రూ.57 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేసి, పూర్తయిన పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా రూ.15 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఎస్సీ వాడలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సైడ్ డ్రైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, గ్రామంలో మరో రూ.10 లక్షలతో నిర్మించనున్న సైడ్ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాల అభివృద్ధికి రూ.10 లక్షలతో మహిళా సంఘం భవన నిర్మాణానికి, రైతుల రాకపోకలకు సౌకర్యంగా రూ.6 లక్షలతో ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల భద్రత కోసం రూ.2 లక్షలతో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.4 లక్షలతో పాఠశాలలో కంప్యూటర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టారు.అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే బీఎంఆర్ 943 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులను కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు వెంకటమ్మ, వెంకటయ్య, అనిత, శాంతిబాయి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కల్లాలు నరసింహులు గౌడ్, మాజీ పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ చందర్ నాయక్, వెంకట్రాంరెడ్డి, మాధవరెడ్డి, శంకర్ రెడ్డి, నర్సిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ లాలప్ప, రేషన్ డీలర్ రాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.