పసల కుటుంబానికి న్యాయం చేయాలి
పసల కుటుంబానికి న్యాయం చేయాలి
- రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి
- బెదిరింపులపై విచారణ జరపాలి
- మహిళకు న్యాయం జరిగేవరకు పోరాటం
- మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి
కొత్తగూడెం ఆర్ సీ,సూర్య)- వ్యాపార లావాదేవీల్లో పసల అరుణ కుటుంబానికి రావాల్సిన రూ.43 లక్షల బకాయిలను వెంటనే చెల్లించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ (మహిళా సమాఖ్య) జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు మహిళా సమైక్య ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత మహిళ పసల అరుణకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యానగర్ కాలనీకి చెందిన పసల అరుణ భర్త ప్రసాద్ 18 ఏళ్లుగా చేసిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన సొమ్మును చెల్లించకుండా యజమాని వేధింపులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. 2008లో బీ-లైన్ వ్యాపారంలో రూ.15 లక్షల పెట్టుబడితో పాటు లాభాల్లో 30 శాతం వాటా ఇస్తామని నమ్మించి, తీరా ప్రసాద్ అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకున్నాక బకాయిలు ఎగ్గొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రూ.2 లక్షలు మాత్రమే ఇచ్చి, ఫైనాన్స్‌కు సంబంధించిన రికార్డులను తీసుకెళ్లడం దారుణమన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భర్త వైద్య ఖర్చుల కోసం తమ సొమ్మును ఇవ్వాలని అడిగితే దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడటం శోచనీయమన్నారు. వ్యాపార లెక్కలను అధికారులు నిష్పక్షపాతంగా పరిశీలించి అరుణ కుటుంబానికి రావాల్సిన రూ.43 లక్షల మొత్తాన్ని ఇప్పించాలని కోరారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై తక్షణమే విచారణ జరిపి బాధిత మహిళకు పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మామిడాల ధనలక్ష్మి, షాహీన్, దార్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.