telangana
అకాల వర్షంతో అన్నదాతల్లో ఆందోళన.. మేడ్చల్ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
మేడ్చల్, మేజర్ న్యూస్: ఆర్నబ్ తుఫాను ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం పడటంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. గత కొంతకాలంగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, సాయంత్రం వేళ కురిసిన వర్షంతో రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. మేడ్చల్, కిష్టాపూర్, నూతనకల్, డబిల్‌పూర్, లింగాపూర్, కండ్లకోయ, గుండ్లపోచంపల్లి తదితర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు పంటలు చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.