కాటారం బంకుల్లో కొలతల మాయాజాలం-నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న లీగల్ మెట్రాలజీ విభాగం
కాటారం, మేజర్ న్యూస్, మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులు అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. వినియోగదారుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని బంకుల యాజమాన్యాలు కొలతల్లో మాయాజాలం సృష్టిస్తూ, నాణ్యత లేని ఇంధనాన్ని విక్రయిస్తూ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిఘా లోపం, తూతూమంత్రంగా సాగుతున్న తనిఖీల కారణంగా ఇక్కడి బంకుల యాజమాన్యాలకు ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా వ్యాపారం సాగుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మండలంలోని ఓ పెట్రోల్ బంకులో ఓ వాహనదారుడు డీజిల్ పోయించుకుని వరంగల్‌కు బయలుదేరాడు. అయితే, మార్గమధ్యంలోనే ఇంధనం అయిపోవడంతో సదరు వాహనదారుడు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యాడు. పోయించిన డీజిల్‌కు కనీస మైలేజ్ కూడా రాకపోవడం కొలతల్లో జరుగుతున్న మోసానికి అద్దం పడుతోంది.ఇదిలా ఉండగా, మరో బంకులో ఘోరం వెలుగుచూసింది. ఓ వినియోగదారుడు తన వాహనంలో పెట్రోల్ పోయించుకుని ఇంటికి బయలుదేరగా, కొద్దిదూరం వెళ్లగానే వాహనం మొరాయించింది. అనుమానంతో ట్యాంక్ తెరిచి చూడగా పెట్రోల్‌లో భారీగా నీరు కలవడాన్ని గమనించి షాక్‌కు గురయ్యాడు. దీనిపై సదరు వాహనదారుడు బంక్ సిబ్బందిని నిలదీయగా వారు కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్య సమాధానాలు చెప్పడం గమనార్హం.ఈ ప్రాంతంలో లీగల్ మెట్రాలజీ (తూనికలు, కొలతల శాఖ) అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ, వారు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఇతర అధికారులు ఎవరైనా తనిఖీలకు వస్తున్నారనే సమాచారం ఉంటే.. బంక్ యాజమాన్యాలకు ముందస్తుగానే ‘సమాచారం’ అందుతోందని, దీంతో వారు అన్నిటినీ మేనేజ్ చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా పబ్బం గడుపుకుంటున్నారని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, కాటారం మండలంలోని పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, కల్తీకి, కొలతల మోసాలకు పాల్పడుతున్న యాజమాన్యాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు, వాహనదారులు బలంగా డిమాండ్ చేస్తున్నారు
రిపోర్టర్ :సుధాకర్ రెడ్డి, కాటారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా