telangana
కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మెకు సిద్ధం
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జిజిహెచ్ ముందు శానిటేషన్, పేషేంట్ కేర్ మరియు సెక్యురిటీ సిబ్బంది తో కలిసి నిరసన తెలియజేసి, అనంతరం ఆర్ ఎం ఓ డా,, తిరుమలేష్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లపెళ్లి దివాకర్ గౌడ్ మాట్లాడుతూ గతంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి శానిటేషన్, పేషెంట్‌కేర్, సెక్యూరిటీ కార్మికుల వేతనాలు పెంచేవారు. కానీ ఈ సారి 4 సంవత్సరాలు దాటిన వేతనాలు పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు డ్యూటీలో జాయిన్ అయినవారికి కనీసం 16వేలు చెల్లించాలని జి.ఓ.నెం.6 జారీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు గత 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల సర్వీసులో ఉన్న ఉద్యోగులు. కావున వారికి న్యాయమైన పద్దతిలో నెలకు రూ. 26వేలు చెల్లించాలని అలాగే చట్ట ప్రకారం పైన సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సంవత్సరానికి ఒక నెల జీతం బోనస్ గా చెల్లించాలని, కాంట్రాక్టర్లు ఇస్తున్న మొత్తం వేతనంపై ఇయస్ఐ, పిఎఫ్‌లను కట్చేస్తూ కార్మికుల ఖాతాల్లో మాత్రం చాలా తక్కువ సొమ్మును జమచేస్తున్నారు. చట్ట ప్రకారం కార్మికులకు చెల్లించే పూర్తి వేతనంపై పిఎఫ్, ఇయస్ఐలను మినహాయించగా వచ్చిన సొమ్ముకు అంతే సొమ్ము కలిపి కార్మికుల ఖాతాల్లో జమచేయాలి. ఒకవేళ కాంట్రాక్టర్ జమచేయని యడల చట్టం ప్రకారం ముఖ్య యజమాని చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. అలాగే ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ తేది: 09.08.2026న డి.ఎం.ఐ.కార్యాలయం ముందు ధర్నా నిర్వహించినప్పుడు ప్రతినెల 1వ తేదీన వేతనాలు చెల్లిస్తామని అప్పటి డి.ఎం.ఐ. మరియు వైద్య ఆరోగ్య శాఖామాత్యులు దామోదర రాజనర్సింహ్మ ప్రతికల ద్వారా ప్రకటించారు. కానీ ఒక్క ఉస్మానియా ఆసుపత్రి మినహాయించి ఏ ఆసుపత్రిలో కూడా 1వ తేదీన వేతనాలు చెల్లించడం లేదు. కాబట్టి అన్ని ఆసుపత్రుల్లో ప్రతినెల 1వ తేదీన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 12.11.2026 నుండి ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు జిల్లాలోని అన్ని ఆసుపత్రిల ముందు ధర్నాలు నిర్వహించామని, స్పందించనీ యడల 28.11.2026 నుండి లేదా ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. మా న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి ఆందోళన కార్యక్రమాలు జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, నీల, మాలతి, పద్మ, ప్రమీల, తిరుపతి ఆసుపత్రి శానిటేషన్, పేషేంట్ కేర్ మరియు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.