national
మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్రం కీలక కసరత్తు
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తీసుకొచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక కసరత్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో భాగంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను వేగవంతం చేసి, రాజ్యాంగ సవరణ ద్వారా ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచే అంశాన్ని సర్కార్ తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ కీలక బిల్లుకు ఆమోదముద్ర వేసేందుకు వీలుగా త్వరలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచేందుకు ఉద్దేశించిన 33 శాతం రిజర్వేషన్ల అమలులో ఎలాంటి న్యాయపరమైన లేదా సాంకేతిక అడ్డంకులు తలెత్తకుండా ఉండేందుకే సీట్ల పెంపు ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న స్థానాలను తగ్గించకుండా, పెరిగే కొత్త స్థానాల ద్వారా మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం వల్ల అన్ని రాష్ట్రాలకు సముచిత న్యాయం జరుగుతుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లుకు ఉభయ సభల్లోనూ పూర్తిస్థాయి మెజారిటీ సాధించగలమని కేంద్ర ప్రభుత్వం పూర్తి ధీమాతో ఉంది. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలకనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.