national
భారత్ కు అనుకూలం కాదు .. వ్యతిరేక సమ్మిట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్-2026’ (Bharat Summit) పై కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నవంబర్ 13, 14 తేదీల్లో జరగనున్న ఈ సదస్సు ‘భారత్ సమ్మిట్’ కాదని, అది ముమ్మాటికీ ‘భారత వ్యతిరేక సమ్మిట్’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. దేశంపై విషం చిమ్మే విదేశీ శక్తుల కోసం, దేశంలో పెట్టుబడులను అడ్డుకోవడంతో పాటు భారత అభివృద్ధిని, రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసే కుట్రతోనే ఈ సదస్సును వేదికగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తప్పుడు ఆరోపణలు చేయడానికే భారత్ సమ్మిట్‌ను ఉపయోగిస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం, పేదరికం, కులమత రాజకీయాలు గణనీయంగా తగ్గి దేశం ప్రగతి పథంలో దూసుకెళ్తుంటే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏనాడూ దేశ అభివృద్ధిని అభినందించలేదని అన్నారు. భారత్ వ్యతిరేక శక్తుల కోసమే రాహుల్ పనిచేస్తున్నారని, అసలు దేశం పట్ల ఆయన విజన్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీల అమలుపై రాహుల్ గాంధీ ఇదే సమ్మిట్ వేదికగా సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి నిలదీశారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలన, విజన్ లేని రాహుల్ గాంధీ డైరెక్షన్‌తో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.