జీవనజ్యోతి బీమా' చెక్కుల పంపిణీ ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేత
కావలి, మేజర్ న్యూస్ : అనారోగ్య కారణాలతో మృతి చెందిన ముగ్గురు ఖాతాదారుల కుటుంబాలకు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన (PMJJBY) పథకం కింద రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (APGB) అధికారులు మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కావలి మండలం వెంకయ్యగారిపాలెం గ్రామానికి చెందిన తాత తిరుపతమ్మ, కావలి తుఫాన్ నగర్‌కు చెందిన శివలింగం లచ్చమ్మ, తాళ్లపాలెంకు చెందిన కటికాల రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. మరణించిన వీరు తమ బ్యాంకులో 'ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన' పథకంలో సభ్యులుగా ఉన్నట్లు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అధికారులు గుర్తించారు. వెంటనే ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్, బ్యాంకు మేనేజర్ చొరవ తీసుకుని, మృతుల వివరాలను పరిశీలించి వారి తరఫున బీమా క్లెయిమ్‌ను త్వరితగతిన పూర్తి చేశారు. ఈ మేరకు మంజూరైన రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చెక్కులను మృతుల నామినీలు (కుటుంబ సభ్యులు) అయిన తాత రమణయ్య, శివలింగం శ్రీనివాసులు, కటికాల సుజాతలకు అందజేశారు.
రీజినల్ మేనేజర్ ఎస్.కె. యూసఫ్, కావలి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాజీవ్ పాత్ర చేతుల మీదుగా బాధితులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మృతుల బంధుమిత్రులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.