కార్మిక రంగానికి ఉరితాళ్లుగా నూతన చట్టాలు!
పటాన్‌చెరు;కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు నూతన కార్మిక చట్టాలు కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పుగా మారనున్నాయని, పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసే విధంగా ఉన్న ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని బిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులకు భంగం కలిగించే నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే కార్మిక వర్గాల నుంచి దేశవ్యాప్త నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.బిఆర్టియు రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం పటాన్‌చెరు విభాగం పరిధిలోని పీవీ నరసింహారావు సమావేశ మందిరంలో వివిధ పరిశ్రమలకు చెందిన కార్మికులకు నూతన కార్మిక చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, ప్రముఖ విశ్లేషకులు విజయ్ సారథి, సీనియర్ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న కార్మికుల హక్కులను పరిరక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా,పరిశ్రమల్లో కార్మిక సంఘాల ప్రాధాన్యతను తగ్గించేలా నూతన చట్టాలను రూపొందించారని ఆరోపించారు. పెట్టుబడిదారీ వర్గాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు.నూతన కార్మిక చట్టాల అమలుతో ఉద్యోగ భద్రత, వేతనాలు, పని పరిస్థితులు, కార్మిక సంఘాల హక్కులపై ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు తమ హక్కులు, చట్టాల్లోని నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు కార్మికులు సిద్ధమవుతారని హెచ్చరించారు.కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా బిఆర్టియు నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని, వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు నూతన చట్టాలపై అవగాహన కల్పించేందుకు వరుసగా సదస్సులు నిర్వహిస్తామని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంద్రకరణ్ యాదగిరి, పెన్నార్, పీబీఎస్ పెన్నార్,తోషిబా,జేకే పెన్నార్, కిర్బీ, పారగాన్,టెంపుల్ ప్యాకేజింగ్,ఐటీసీ,అగర్వాల్ రబ్బర్, ఫరా ప్లాస్ట్,కార్తికేయ, పీపీఎల్, ఆర్ఈపీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర సంస్థలకు చెందిన కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.