జగన్ వైఖరిపై కాంగ్రెస్ నేత షేక్ సైదా తీవ్ర విమర్శలు
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
విజయమ్మ, షర్మిలను ఎలేహంకా ప్యాలెస్‌కు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గం
మార్కాపురం: బెంగళూరు విమానాశ్రయంలో వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ విజయమ్మలను ఎలేహంకా ప్యాలెస్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని APCC అధికార ప్రతినిధి షేక్ సైదా పేర్కొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కష్టార్జితంతో నిర్మించిన ఇంటికి ఆయన భార్య విజయమ్మ, కుమార్తె షర్మిల వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. జన్మనిచ్చిన తల్లి విజయమ్మకు, తోడబుట్టిన చెల్లెలు షర్మిలకు కన్నీళ్లు మిగిల్చే విధంగా జగన్ వ్యవహరించడం సభ్య సమాజం అసహ్యించుకునే విషయమని వ్యాఖ్యానించారు.
మేనకోడలు అంజలి వివాహ వేడుక సందర్భంగా ఇలాంటి పరిస్థితులు సృష్టించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. కుటుంబ బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాల కంటే కోర్టులు, చట్టాలను అడ్డుపెట్టుకుని వ్యవహరించడం జగన్ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
మేనమామగా అంజలి వివాహాన్ని దగ్గరుండి ఘనంగా జరిపించాల్సిన జగన్, కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటి వివాదాలకు కారణం కావడం బాధాకరమని షేక్ సైదా ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ బంధాలకు విలువనిస్తూ, విజయమ్మ, షర్మిల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.