హైడ్రా కూల్చివేతలపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం ఫాక్స్ సాగర్ బాధితులకు అండగా నిలుస్తామని ప్రకటన.
తెలంగాణ బ్యూరో, ప్రతినిధి: హైడ్రా కమిషనర్ రంగనాథ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టాలు, కోర్టులు, న్యాయ వ్యవస్థను ఏమాత్రం ఖాతరు చేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు ప్రాంతంలో హైడ్రా బాధితులు, పారిశ్రామికవేత్తలు, కార్మికులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టానికి లోబడి పనిచేయాలి.. ఇష్టారాజ్యం కుదరదు. హైడ్రా ఏర్పడిన తొలినాళ్లలో చెరువులు, నాలాలు బాగుపడతాయని, అక్రమ కట్టడాల తొలగింపు మంచి నిర్ణయమేనని కొందరు సమర్థించారని, అయితే 25-26 ఏళ్ల రాజకీయ అనుభవంతో ఇది చివరకు పేదల ఇళ్లు, పరిశ్రమలను కూల్చే సంస్థగా మిగిలిపోతుందని తాను అప్పుడే హెచ్చరించానని ఈటల గుర్తుచేశారు. తాము పర్యావరణానికి, చట్టాలకు, ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదని, అయితే చట్టబద్ధంగా ఏర్పడిన హైడ్రా చట్టానికి లోబడి పనిచేయాలే తప్ప 'తాత జాగీర్' లాగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ హైడ్రా వెంబడి పడ్డాడని కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసిందని, జీడిమెట్ల, దూలపల్లి, చర్లపల్లి, ఉప్పల్-మల్లాపూర్ సహా ఉత్తర హైదరాబాద్‌లోని పారిశ్రామిక వాడలన్నీ తన మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకే వస్తాయని, స్థానిక ఎంపీగా ప్రజలు, పరిశ్రమల రక్షణ తన కర్తవ్యమని పేర్కొన్నారు. పోలీసు, మున్సిపాలిటీ, పరిశ్రమల శాఖ వంటి వ్యవస్థలన్నీ విఫలమై బాధితుల గోడు వినేవారు లేకపోవడంతోనే తాను ప్రత్యక్ష పోరాటానికి దిగానని తెలిపారు.
83 పరిశ్రమల ఆందోళన.. మంత్రి శ్రీధర్ బాబుకు లేఖ.
దూలపల్లి, జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాల్లో ఒక్కొక్కరు రూ. 4 కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి 83 పరిశ్రమలను నడుపుతున్నారని, వాటిపై వేలాది మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. పక్కనే ఉన్న వెంకటేశ్వర ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ బాధితులకు ఈ నెల 20వ తేదీన కోర్టు 'స్టేటస్ కో' ఇచ్చినప్పటికీ అక్కడ కూల్చివేత పనులు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై పరిశ్రమల శాఖ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి-మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబుతో ఉదయమే మాట్లాడానని, సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్వయంగా లేఖ కూడా రాశానని వెల్లడించారు..నగరీకరణ, గత ప్రభుత్వాల నిర్ణయాలు.. భూసేకరణ చట్టం ఏది? తాను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు 'మిషన్ కాకతీయ' సమయంలోనే పట్టా భూములు ముంపునకు గురైతే పరిహారం ఇవ్వాలని ప్రతిపాదించానని చెప్పారు. దశాబ్దాల క్రితం నాటి ప్రభుత్వాలు, కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులే ఆయకట్టు మార్పు (ఆయాన్ కన్వర్షన్) చేసి లేఅవుట్లు, పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారని గుర్తుచేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్, తన స్వగ్రామంలోని 'ఊరగుంట' స్థలంలో నిర్మించిన ఎంఆర్వో, ఎంపీడీవో కార్యాలయాలు చెరువు స్థలాల్లో కట్టినవేనని, వాటిని కూల్చే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని సవాల్ విసిరారు. అప్పటి ముఖ్యమంత్రులు చేసిన పనులు తప్పని శిక్ష వేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో సెక్రటేరియట్, జలవిహార్, ఎన్టీఆర్ ఘాట్, అంబేద్కర్ విగ్రహం, నెక్లెస్ రోడ్, బస్తీలు, చివరికి హైడ్రా కార్యాలయం కూడా ఉన్నాయనే ప్రచారం ఉందని, వాటిని కూల్చగలరా అని నిలదీశారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ కూడా హుస్సేన్ సాగర్‌ను కొబ్బరి నీళ్లలా మారుస్తానని చెప్పారని, కానీ నేటికీ హుస్సేన్ సాగర్, ఫాక్స్ సాగర్, అల్వాల్, ఉప్పల్ చెరువులన్నీ డ్రైనేజీ నీటితో నిండి దుర్గంధం వెదజల్లుతున్నాయని విమర్శించారు. ముందుగా ఉన్న చెరువులకు కట్టలు వేసి, మురికి నీరు రాకుండా శుద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఫాక్స్ సాగర్‌లో ప్రభుత్వ భూమి ఎంత, ప్రైవేట్ పట్టా భూమి ఎంత అనే లెక్కలను బహిర్గతం చేయాలని, పట్టా భూములు అవసరమైతే భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం లేదా భూమికి బదులు భూమి ఇవ్వాలి కానీ, బలవంతంగా లాక్కోవడం సరికాదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తనపై 250-300 కేసులు నమోదయ్యాయని, ఇప్పుడు కూడా ప్రజల కోసం ఎన్ని కేసులు పెట్టినా ముందుండి పోరాడుతానని స్పష్టం చేశారు.
సమావేశంలో పాల్గొన్న నేతలు:
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ వడ్డెపల్లి రాజేశ్వర్ రావు, సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు శేఖర్ యాదవ్, రాజిరెడ్డి, సరిత, సతీష్ సాగర్, అసోసియేషన్ ప్రెసిడెంట్ సామేశ్వర్ రావు, నాయకులు, 83 కంపెనీల యజమానులు, కార్మికులు పాల్గొన్నారు.