భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్నవరంలో ప్రత్యేక చర్యలు
- దుకాణాల నిర్వహణకు హద్దులు ఏర్పాటు
– నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
- భక్తుల సౌకర్యమే ప్రధాన లక్ష్యం
– ఈవో లక్ష్మీ శివజ్యోతి
అన్నవరం, మేజర్ న్యూస్ :
కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివస్తున్నారు. ముఖ్యంగా వారాంతాలు, పర్వదినాలు, కార్తీక మాసం సందర్భంగా కొండపై భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేందుకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
కొండపై భక్తుల రాకపోకలకు ఆటంకాలు కలగకుండా, నడక మార్గాలు ఆక్రమణలకు గురికాకుండా ఉండేందుకు దుకాణాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా కొండపైన ఉన్న దుకాణాల యజమానులు తమ దుకాణాల పరిధిని దాటి వ్యాపార సామగ్రిని బయటకు ఏర్పాటు చేయకుండా దేవస్థానం తరపున నిర్దిష్ట సరిహద్దు గీతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే దుకాణదారులను ఆ గీత వెనుకకు పంపించి, నిర్ణయించిన పరిధిలోనే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కుటుంబ సభ్యులతో పాటు వృద్ధులు, చిన్నపిల్లలతో కొండపైకి వస్తుంటారు. ఇలాంటి సమయంలో దుకాణాల ముందు వ్యాపార సామగ్రి ఎక్కువగా ఉంచడం, నడక మార్గాన్ని ఆక్రమించడం వల్ల భక్తుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని భక్తుల నడక మార్గం విశాలంగా ఉండేలా, రద్దీ సమయంలో కూడా భక్తులు సులభంగా రాకపోకలు సాగించేలా ఈ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో లక్ష్మీ శివజ్యోతి దుకాణాల యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దేవస్థానం అధికారులు ఏర్పాటు చేసిన సరిహద్దు గీతను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత పరిధిని దాటి దుకాణాల సామగ్రిని ముందుకు పెట్టరాదని సూచించారు. వ్యాపార నిర్వహణ పేరుతో భక్తులు నడిచే మార్గాలను ఆక్రమించకూడదని స్పష్టం చేశారు. దేవస్థానం నిబంధనలను ఉల్లంఘించి సరిహద్దు గీతను దాటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేవస్థానం పరిధిలోని ప్రతి ఒక్కరూ భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వ్యాపారస్తులు తమ వ్యాపారంతో పాటు భక్తుల రాకపోకలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దేవస్థానం తీసుకుంటున్న ఈ నిర్ణయానికి దుకాణాల యజమానులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అన్నవరం క్షేత్రానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడంతో పాటు కొండపై రద్దీని క్రమబద్ధీకరించడం, నడక మార్గాలను అందుబాటులో ఉంచడం, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడడమే లక్ష్యంగా దేవస్థానం అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. భక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈవో లక్ష్మీ శివజ్యోతి తీసుకుంటున్న చర్యలతో కొండపై రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని భక్తులు అభిప్రాయ పడుతున్నారు.