17 ఏళ్ల వెనుకబాటుతనానికి తెరపడాలంటే రామాయంపేటను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా పునరుద్ధరించాలి
రామాయంపేట;రామాయంపేట ప్రాంతం గత 17 ఏళ్లుగా ఎదుర్కొంటున్న వెనుకబాటుతనాన్ని తొలగించాలంటే రామాయంపేటను తిరిగి ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా పునరుద్ధరించాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు డిమాండ్ చేశారు. రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియలో రామాయంపేటకు ప్రత్యేక శాసనసభ నియోజకవర్గ హోదా కల్పించాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 1952 నుంచి 2009 వరకు దాదాపు 57 ఏళ్ల పాటు రామాయంపేట ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా కొనసాగి ప్రత్యేక గుర్తింపు పొందిందని గుర్తుచేశారు. అయితే 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో రామాయంపేట నియోజకవర్గాన్ని రద్దు చేసి, పరిసర నియోజకవర్గాల్లో విలీనం చేయడంతో ఈ ప్రాంత ప్రజలు తమ ప్రత్యేక రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రత్యేక నియోజకవర్గం లేకపోవడంతో ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కొరవడిందని, ఫలితంగా రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, ఉన్నత విద్య, వైద్య సదుపాయాల కల్పన వంటి కీలక రంగాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు. ప్రజల సమస్యలను సమర్థవంతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక రాజకీయ ప్రాతినిధ్యం అవసరమని పేర్కొన్నారు.మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారి 44 (NH-44) సమీపంలో రామాయంపేట వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని, వాణిజ్య, వ్యవసాయ రంగాలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందే అన్ని అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రామాయంపేటను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా పునరుద్ధరించడంతో పాటు రెవెన్యూ డివిజన్‌ను కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఇది కేవలం రాజకీయ డిమాండ్ మాత్రమే కాదని, వేలాది రైతు కుటుంబాలకు, ఈ ప్రాంత ప్రజలకు సముచిత నిధులు, మెరుగైన పరిపాలన, అభివృద్ధి ఫలాలు అందించేందుకు అవసరమైన చర్య అని రాగి రాములు స్పష్టం చేశారు. రామాయంపేట ప్రాంత సమగ్ర అభివృద్ధి, పూర్వ వైభవం సాధన కోసం ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పార్టీలకతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.