ఆకాశంలో తారలా మెరిసిన చిన్నారి మాన్యత.. బాలనటిగా దూసుకుపోతున్న సంగారెడ్డి ముద్దుబిడ్డ!
సంగారెడ్డి;చిన్న వయసులోనే వెండితెరపై తనదైన ముద్ర వేస్తూ నటనా రంగంలో అద్భుతంగా రాణిస్తోంది సంగారెడ్డి ప్రాంతానికి చెందిన చిన్నారి పట్నం మాన్యత. ఆకాశంలో తారలా మెరిసిపోతూ తన సహజ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది. ఇటీవల విడుదలైన ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో కీలక పాత్ర పోషించి తన నటనా ప్రతిభతో సినీ పరిశ్రమకు చెందిన పలువురి ప్రశంసలు అందుకుంది.అంతటితో ఆగకుండా ప్రస్తుతం ప్రముఖ హీరోయిన్ రష్మిక నటిస్తున్న మరో సినిమాలోనూ మాన్యత కీలక పాత్ర పోషిస్తోంది. వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ బాలనటిగా తన ప్రతిభను చాటుకుంటోంది.మాన్యత నటనా ప్రయాణంలో తండ్రి పట్నం రవితేజ, తల్లి, తాతయ్య పట్నం మాణిక్యం, నానమ్మ అందిస్తున్న ప్రోత్సాహం, సహకారం ఎంతో కీలకంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే తన ఎదుగుదలకు ప్రధాన బలమని సన్నిహితులు చెబుతున్నారు.సంగారెడ్డి ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్నం మాణిక్యం మనవరాలిగా మాన్యత సాధిస్తున్న విజయాల పట్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే నటనపై ఆసక్తి, పట్టుదల, సహజ అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్న మాన్యత భవిష్యత్తులో స్టార్ నటిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు.కుటుంబ ప్రోత్సాహం.. ప్రతిభకు పట్టుదల తోడైతే విజయాలు వరిస్తాయనడానికి చిన్నారి మాన్యత ఓ చక్కటి ఉదాహరణ. సంగారెడ్డి పేరు వెండితెరపై మరింతగా మారుమోగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.