*సోనియా గాంధీ బయోపిక్‌కు దర్శకుడిగా క్రాంతి మాధవ్ ఎంపిక!*
సంగారెడ్డి;సోనియా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సినిమాకు ప్రముఖ దర్శకుడు క్రాంతి మాధవ్‌ను ఎంపిక చేశారు. జగ్గారెడ్డి, హరిప్రసాద్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.డిసెంబర్ 10 నుంచి ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కలిసి సినిమా నిర్మాణానికి ఆమె అనుమతి తీసుకోనున్నట్లు మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు.గతంలో ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రాంతి మాధవ్ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.సోనియా గాంధీ రాసిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' అనే ఆత్మకథలోని ప్రధాన అంశాలను కథాంశాలుగా తీసుకుని ఈ సినిమాను రూపొందించనున్నట్లు జగ్గారెడ్డి వివరించారు.సోనియా గాంధీ, రాజీవ్ గాంధీల ప్రేమకథతో పాటు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల బలిదానాలు, దేశం కోసం వారు చేసిన త్యాగాలు, వారి అనంతరం సోనియాగాంధీ ఎదుర్కొన్న పరిస్థితులు, ప్రజాసేవ కోసం ఆమె రాజకీయాల్లోకి రావడం, ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేయడం, పేద ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న కీలక నిర్ణయాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నట్లు తెలిపారు.ఎలాంటి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను ఆశించకుండా కేవలం గాంధీ కుటుంబ చరిత్ర, దేశానికి ఆ కుటుంబం చేసిన సేవలు, త్యాగాలను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా నిర్మిస్తున్నట్లు జగ్గారెడ్డి స్పష్టం చేశారు.ఈ సినిమా కోసం ఎవరి నుంచీ ఒక్క పైసా కూడా తీసుకోబోమని, సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన 50 మంది కార్యకర్తలతో ఫైనాన్స్ కమిటీ ఏర్పాటు చేసి, తమ సొంత ప్రయత్నాలతోనే సినిమాను నిర్మిస్తామని వెల్లడించారు.సోనియాగాంధీ ఆత్మకథలోని భావాలను దేశ, విదేశాల్లోని ప్రజలకు మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని జగ్గారెడ్డి పేర్కొన్నారు.మొత్తానికి సోనియాగాంధీ జీవిత ప్రయాణం వెండితెరపై ఆవిష్కృతం కానుండగా, డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ఢిల్లీ పర్యటన, సోనియాగాంధీ అనుమతిపై ఆసక్తి నెలకొంది.