గీతంలో రఫ్ సెట్ సిద్ధాంతంపై కార్యశాల
పటాన్‌చెరు:వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు (ఏఐ), డేటా సైన్స్ రంగాల్లో ఎదురయ్యే అనిశ్చితిని పరిష్కరించడంతో పాటు, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో రఫ్ సెట్ సిద్ధాంతం ప్రాధాన్యతను వివరించేందుకు గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో మంగళవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించారు. రఫ్ సెట్ సిద్ధాంత వ్యవస్థాపకుడు, ప్రముఖ గణిత, కంప్యూటర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జిడ్జిస్లావ్ పావ్లాక్ శతజయంతిని పురస్కరించుకుని గణిత, గణాంక శాస్త్ర విభాగం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.అనిశ్చితిలో తార్కికతకు సంబంధించిన గణిత పునాదులపై ప్రొఫెసర్ పావ్లాక్ చేసిన కృషిని స్మరించడంతో పాటు, సమకాలీన ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ రంగాల్లో రఫ్ సెట్ సిద్ధాంతం ప్రాధాన్యతను వివరించడం కార్యశాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ మాజీ సీనియర్ ప్రొఫెసర్ సి.ఆర్. రావు,అదే విభాగానికి చెందిన ప్రొఫెసర్ సల్మాన్ అబ్దుల్ మోయిజ్, హైదరాబాద్ ఎంజీఐటీ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.వి. రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.రఫ్ సెట్ సిద్ధాంతం సైద్ధాంతిక పునాదులు, వివిధ రంగాల్లో దాని అనువర్తనాలు, పరిశోధన అనుభవాలను వారు వివరించారు.సాంకేతిక సమావేశాల్లో అట్రిబ్యూట్ రిడక్షన్, ఫీచర్ సెలక్షన్, రూల్ ఇండక్షన్, గ్రాన్యులర్ కంప్యూటింగ్, నాలెడ్జ్ డిస్కవరీ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి అంశాలపై చర్చించారు. హైబ్రిడ్ రఫ్ సెట్ నమూనాల ద్వారా డేటా విశ్లేషణ, తెలివైన నిర్ణయాలు తీసుకునే విధానాలను వివరించారు.వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు,పరిశోధకులు, పీజీ విద్యార్థులు ఈ కార్యశాలలో పాల్గొని నిపుణులతో తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.అంతర్‌విభాగ పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది.కార్యశాల ప్రారంభోత్సవానికి గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం. రెజా అధ్యక్షత వహించగా,గణిత, గణాంక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జాదవ్ గణేష్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.డాక్టర్ డి. మల్లికార్జున రెడ్డి,డాక్టర్ నాయర్ రమ్య రవీంద్రన్ సమన్వయం చేశారు.కార్యశాల