ధరూర్ మెథడిస్ట్ జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ స్నేహ మెహ్ర
ధరూర్, మేజర్ న్యూస్ : ధరూర్ మండలంలో జరుగుతున్న మెథడిస్ట్ జాతరకు వచ్చే భక్తులు, సందర్శకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఐపీఎస్ తెలిపారు. శనివారం జాతర ప్రాంగణాన్ని సందర్శించిన ఎస్పీ భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జాతర ప్రాంగణం, ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్లతోనూ పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను మోహరించాలని సూచించారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్, జేబు దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. మహిళలు, బాలికల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ షీ టీమ్స్‌ను అందుబాటులో ఉంచామని, ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. వాహనదారులు కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలను నిలిపి పోలీసులకు సహకరించాలని కోరారు. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందిస్తూ అన్ని విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తులు పోలీస్ శాఖ సూచనలు పాటించి సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, డీసీఆర్‌బీ డీఎస్పీ జనయ్య, ధరూర్ ఇన్‌స్పెక్టర్ రఘురాం, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్ రాయ్, ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా, భరోసా ఇన్‌స్పెక్టర్ ప్రమీల, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.