ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహ విద్యార్థులకు దోమతెరల పంపిణీ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు – డాక్టర్ కటారు మానస
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్, ప్రొద్దుటూరు పట్టణంలోని ఏబీఎం స్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల, ఉన్నత పాఠశాల వసతి గృహాల్లో విద్యార్థినులకు దోమతెరలను పంపిణీ చేశారు. వైద్యాధికారి డాక్టర్ కటారు మానస ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులకు స్వయంగా దోమతెరలను అందజేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కటారు మానస మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యలో రాణించి ఉజ్వల భవిష్యత్తును సాధించగలరని పేర్కొన్నారు. ముఖ్యంగా వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినులు దోమకాటు ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని, వీటి నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో అవసరమని తెలిపారు. దోమకాటు నుంచి విద్యార్థులను రక్షించేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకుంటూ నివసిస్తున్న విద్యార్థులకు దోమతెరలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ప్రతి విద్యార్థిని రాత్రి నిద్రించే సమయంలో తప్పనిసరిగా దోమతెరను వినియోగించాలని సూచించారు. అదేవిధంగా వసతి గృహాల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది అని, చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు వైద్య సిబ్బంది సూచనలను పాటించాలని విద్యార్థినులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి సాధు శ్రీనివాసులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి సత్యవతి, సీఓఎం వి. సుబ్బారెడ్డి, హెల్త్ అసిస్టెంట్లు రామకృష్ణ, జయపాల్, వార్డు హెల్త్ సెక్రటరీ పద్మావతి, ఆశా కార్యకర్తలు పిల్లి పుష్పకుమారి, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: ప్రతాప్, ప్రొద్దుటూరు