telangana
చిరు వ్యాపారులపై నోటీసుల పేరుతో వేధింపులా?
సూర్య జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలో చిరు వ్యాపారులపై నోటీసుల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల చర్యల్లో సమానత్వం లేదని మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీపతి నరేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.జమ్మికుంటలో భారీ వ్యాపార సంస్థల నుంచి సంవత్సరానికి కేవలం 2,40,000 రూపాయల పన్ను కూడా వసూలు చేయలేదనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఒక చిరు వ్యాపారికి పదేళ్లకు పైగా కాలానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులు 2,40,000 రూపాయలు చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.చిరు వ్యాపారుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకోకుండా ఇలాంటి నోటీసులు ఇవ్వడం నూతన పాలకవర్గ పరిపాలనకు పెద్ద మచ్చగా మిగిలే అవకాశం ఉందని అన్నారు. చిరు వ్యాపారులకు ఒక న్యాయం, పెద్ద వ్యాపార సంస్థలకు మరో న్యాయమా అని నిలదీశారు.ప్రజాపాలనలో పారదర్శకత, సమానత్వం ఉండాలని, చిరు వ్యాపారులకు న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు.