చిన్నారుల ముఖాల్లో దీపావళి వెలుగులు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నూతన వస్త్రాల పంపిణీ మానవత్వం చాటుకున్న కమలా మనోహర్ దంపతులు
చేవెళ్ల: పండుగ అంటే నలుగురితో కలిసి ఆనందాన్ని పంచుకోవడమేనని నిరూపించారు చేవెళ్ల మండలానికి చెందిన జి. కమలా మనోహర్ దంపతులు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని దామరగిద్ద, న్యాలట, ఎన్కేపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నూతన వస్త్రాలను పంపిణీ చేసి చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపారు.
ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కమలా.. పాఠశాలల్లోని విద్యార్థులను సొంత పిల్లలుగా భావిస్తూ వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పండుగకు కొత్త బట్టలు కొనుగోలు చేసుకోలేని పేద విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో భర్త మనోహర్‌తో కలిసి ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు నూతన వస్త్రాలు అందజేసి వారితో దీపావళి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఎల్. పురందాస్, ఎంపీడీవో బన్సీలాల్ కమలా మనోహర్ దంపతుల సేవా దృక్పథాన్ని అభినందించారు. విద్యార్థుల పట్ల వారు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జి. బుచ్చయ్య, ఉపసర్పంచ్ ఈ. అశోక్, పాఠశాల చైర్మన్ సీహెచ్. మానస, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.