శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా రాహుకాల పూజలు, ప్రదోషకాల అభిషేకాలు
నెల్లూరు కల్చరల్, మేజర్ న్యూస్ : నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం విశేష రాహుకాల ఉద్యాపన పూజలు శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో 22 మంది భక్తులు పాల్గొని అమ్మవారికి చీరజాకెట్టు, 108 నిమ్మకాయల మాలలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం ఉప ఆలయమైన శ్రీ మీనాక్షీ సమేత సుందరేశ్వర స్వామి దేవస్థానంలో త్రయోదశిని పురస్కరించుకుని ప్రదోషకాల పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. శ్రీ సుందరేశ్వర స్వామి వారికి, నందీశ్వరునికి వేదపండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ విశేష అభిషేకాలు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభిషేక సేవలను తిలకించగా, అనంతరం వారికి పంచామృతం, పులిహోర ప్రసాదాలు అందజేశారు. రాత్రి వేళ సంధ్యా హారతులు, కుంభహారతులు సమర్పించిన అనంతరం స్వామివారి పల్లకీసేవ అత్యంత నేత్రపర్వంగా సాగింది. ఈ కార్యక్రమాలన్నీ ఆలయ సహాయ కమిషనరు, కార్యనిర్వాహణాధికారి నూతలపాటి శ్రీధర్ నాయుడు, ఆలయ చైర్మన్ ఏలూరు శిరీష, ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు ప్రధాన అర్చకులు కల్లూరు వీరరాఘవేంద్ర, వేదపండితులు నూరాచార్యుల రఘునాథాచార్యులు, ఆలయ సిబ్బంది పర్యవేక్షణలో జరిగాయి.