శిక్షణకు వచ్చిన సిబ్బందికి భోజనం కరువు!
పార్వతిపురం (బ్యూరో), సూర్య : కౌంటింగ్ శిక్షణకు హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు భోజన సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కురుపాం నియోజకవర్గ పరిధిలోని కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, కొమరాడ మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉల్లి భద్ర సమీపంలోని ఉద్యాన కళాశాలలో నిర్వహించనున్న నేపథ్యంలో సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేశారు.
ఈ శిక్షణకు సుమారు 400 మంది ఉద్యోగులు హాజరుకాగా, అందులో 100 మందికి కూడా సరిపడా భోజనం ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. దీంతో భోజనం అందక పలువురు సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చివరికి భోజనం కోసం సిబ్బంది ఆందోళన చేయవలసిన పరిస్థితి దాపురించిన అయినా సరే భోజనం దొరకని పరిస్థితి. సొంత డబ్బులతో తెచ్చుకుంటామనీ సరే కిలోమీటర్ల దూరం వెళ్ళవలసిన పరిస్థితి అయినా భోజనం విరమణ చాలక పస్తులు ఉండవలసిన వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు సిబ్బంది . ఎన్నికల విధుల నిర్వహణలో కీలక బాధ్యతలు చేపట్టనున్న ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఇంతటి నిర్లక్ష్యమా? అంటూ పలువురు అసహనం వ్యక్తం చేశారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే సిబ్బంది సంఖ్యపై ముందస్తు అంచనా ఉన్నప్పటికీ, అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.