పాత్రికేయులపై దౌర్జన్యం * సెల్‌ఫోన్లు లాక్కొన్నా చర్యల్లేవా? *
సంతబొమ్మాళి, సూర్య : ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా నిలుస్తున్న మీడియాపై దౌర్జన్యం చేసి, విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయుల సెల్‌ఫోన్లను బలవంతంగా లాక్కోవడం ఎంతవరకు సమంజసమని సంతబొమ్మాళి ప్రెస్‌క్లబ్ ప్రశ్నించింది. ఎన్నికల కవరేజీకి వెళ్లిన విలేకరులపై దాడికి యత్నించి, రెండు సెల్‌ఫోన్లను లాక్కున్న ఘటనపై బాధ్యులైన టీడీపీ నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ హేమసుందర్‌రావును కలిసి వినతిపత్రం అందజేసింది.
వివరాల్లోకి వెళితే గురువారం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హెచ్.ఎన్.పేట ఎంపీటీసీ పరిధిలోని ఆకాశలక్కవరం గ్రామంలో ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ చోటుచేసుకున్న ఘర్షణలో టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకులతో పాటు పోలీసుపై దాడికి దిగిన దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తున్న విలేకరుల బృందంపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ప్రెస్‌క్లబ్ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో విలేకరుల వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లను బలవంతంగా లాక్కున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం:-
తమ సెల్‌ఫోన్లను తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ సంబంధిత వ్యక్తులు స్పందించలేదని విలేకరులు తెలిపారు. ఈ ఘటనపై నౌపడ ఎస్సై నారాయణస్వామికి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి సుగ్గు సంతోషి భర్త సుగ్గు రమేష్, ఆయన అనుచరులు ఈ ఘటనలో తమపై దౌర్జన్యానికి పాల్పడి సెల్‌ఫోన్లు లాక్కున్నారని వినతిపత్రంలో ఆరోపించారు. పోలీసులకు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సెల్‌ఫోన్లు తిరిగి అందకపోవడంతో విలేకరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు సమాచారాన్ని అందించాల్సిన పాత్రికేయుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, వారి వ్యక్తిగత పరికరాలను తిరిగి ఇవ్వకుండా నిలిపివేయడం పత్రికా స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే సహించేది లేదు:-
విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులపై దౌర్జన్యానికి పాల్పడటం, వారి సెల్‌ఫోన్లను బలవంతంగా తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ప్రెస్‌క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను పరిశీలించి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, లాక్కున్న రెండు సెల్‌ఫోన్లను వెంటనే తిరిగి ఇప్పించాలని తహసీల్దార్‌ను కోరారు. పాత్రికేయులపై జరిగిన ఈ ఘటనను అధికారులు తేలికగా తీసుకోకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.