andhrapradesh
మురసుకు దెబ్బతిన్న ఉద్యాన పంటల పునరుద్ధరణకు చర్యలు
రైతులకు పలు సూచనలు చేసిన ఉద్యాన అధికారి బి. జ్యోతి
సత్తెనపల్లి న్యూస్ : మురసు తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ఉద్యాన పంటలను తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని ఉద్యాన అధికారి బి. జ్యోతి సూచించారు. ముఖ్యంగా మిరప పంటలో తుఫాను కారణంగా ఏర్పడిన నష్టాన్ని తగ్గించేందుకు సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.ఈ మేరకు శుక్రవారం మండలంలోని ధూళిపాళ్ల గ్రామంలో ఆమె పర్యటించి, తుఫాను అనంతరం మిరప పంటలో ఏర్పడిన సమస్యలను పరిశీలించారు. పంటల పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొలాల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని వెంటనే బయటకు పంపే ఏర్పాట్లు చేసుకోవాలని, గాలులు, వర్షాలకు వాలిపోయిన మిరప మొక్కలను తిరిగి నిలబెట్టి మొదళ్ల చుట్టూ మట్టిని ఎగదోయాలని సూచించారు. మొక్కలు వడలిపోతే లీటరు నీటికి 5 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, 5 గ్రాముల 19:19:19 కలిపి 4 నుంచి 5 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలన్నారు.ఇనుప ధాతు లోపంతో ఆకులు పాలిపోయినట్లు కనిపిస్తే 10 లీటర్ల నీటికి 50 గ్రాముల అన్నభేది, 10 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. అదనంగా ఎకరాకు 50 కిలోల యూరియా, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 200 కిలోల వేపపిండి వేయాలని సూచించారు. నేల ఆరిన వెంటనే అంతర కృషి చేపట్టి కలుపు మొక్కలను తొలగించాలన్నారు. తెల్లదోమ నివారణకు ఎకరాకు 12 నుంచి 15 పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.తుఫాను అనంతరం పంటల్లో తలెత్తే సమస్యలను రైతులు ముందుగానే గుర్తించి, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సూచనల మేరకు చర్యలు చేపడితే పంట నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని బి. జ్యోతి తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది రామ కోటిరెడ్డి, ధూళిపాళ్ల గ్రామ రైతులు పాల్గొన్నారు.