telangana
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి.. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ప్రజాభవన్‌లో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి (బీవీహెచ్‌పీఎస్) వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులు స్పీకర్‌ను కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ సొంత ఇళ్లు లేని తమకు వికారాబాద్ పట్టణ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఆ కాలనీలో రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ముఖ్యంగా వీల్‌చైర్ వినియోగించే దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా ర్యాంపులు, అనువైన రహదారులు ఏర్పాటు చేయాలని విన్నవించారు.దివ్యాంగుల సమస్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సానుకూలంగా స్పందిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.స్పీకర్ సానుకూలంగా స్పందించడంపై బీవీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్, హనుమంతు, భాగ్యమ్మ, సరళ, గణేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.