ఏఐ టెక్నాలజీతో సరికొత్తగా 'కిరికిరి' సినిమా.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ ఒక వినూత్న ప్రయత్నానికి తెరలేచింది. బైక్ రైడర్‌గా ఏకంగా పద్దెనిమిది దేశాలు చుట్టి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో అరుదైన చోటు సంపాదించుకున్న సాహస యాత్రికుడు భరద్వాజ్ దాయాల దర్శకుడిగా టర్న్ తీసుకుంటూ ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. పూర్తిగా ఏఐ టెక్నాలజీని కొత్తగా ఉపయోగిస్తూ హైబ్రీడ్ సాంకేతికతతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'కిరికిరి' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. వన్ మ్యాన్ షో ఫిలింస్ పతాకంపై రవికాంత్ వీరపల్లి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
చిత్రసీమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ 'కిరికిరి' సినిమా లాంచ్ ఈవెంట్ శుక్రవారం ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ అరుదైన ప్రారంభోత్సవ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బాహుబలి సినిమా నిర్మాత ప్రసాద్ దేవినేని, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, దిగ్గజ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టెక్నాలజీ పరంగా సరికొత్త ప్రయోగం చేస్తున్న ఈ బృందాన్ని సినీ ప్రముఖులు అభినందించడం విశేషం.
ఈ సందర్భంగా దర్శకుడు భరద్వాజ్ దాయాల మీడియాతో మాట్లాడుతూ, గడిచిన కొద్ది ఏళ్లుగా తెలుగు సినిమాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోందని, ఇప్పుడున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో మరో విప్లవాత్మక ముందడుగు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తెలిపారు. ఈ అత్యాధునిక సాంకేతికత సహాయంతో ఇప్పటివరకు ఎవరూ చూడని సరికొత్త కథలను, అవుట్ ఆఫ్ ది వరల్డ్ విజువల్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన ఈ ఏఐ హైబ్రీడ్ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.