మహారాజా కళాశాలలో ఎంసీఐసీ కేంద్రం ప్రారంభం...
విజయనగరం, సూర్య : మహారాజా కళాశాల (స్వయంప్రతిపత్తి), విజయనగరంలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో మహారాజాస్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ కన్సల్టెన్సీ కేంద్రాన్ని నవంబర్ 6న ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారిక లోగోను ఆవిష్కరించారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలు, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన ప్రాయోగిక పరిజ్ఞానాన్ని అందించడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ విద్యార్థులకు వాస్తవిక ప్రాజెక్టులపై పనిచేసే అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి పరిశ్రమ భాగస్వామిగా హాజరైన హైదరాబాద్‌కు చెందిన టీఆర్ఎన్ఈటీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తరుణ్ మహాపాత్రో పరిశ్రమల అవసరాలు, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, విద్యార్థులకు లభించే అవకాశాలపై ప్రసంగించారు. విద్యార్థులు పరిశ్రమలతో అనుసంధానమై తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కళాశాల, పరిశ్రమల మధ్య ఈ భాగస్వామ్యం విద్యార్థులకు ప్రాయోగిక అనుభవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి విశేష సహకారం అందించిన కళాశాల కరస్పాండెంట్ డా. కె.వి.ఎల్. రాజు, ప్రిన్సిపాల్ డా. ఎం. సాంబశివరావు , కన్వీనర్లు, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఎల్.పి. నాయుడు , కార్యక్రమ సమన్వయకర్త కుమారి కె. సింధుష కి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే అధ్యాపకులు, విద్యార్థులు అందించిన సహకారాన్ని అభినందించారు.